జనవరి 13, 2010

హిమకుసుమాలు-84( క(అ)లవాటుగా…!)

ముచ్చటగా వున్న ముద్దుగుమ్మ ముగ్గులపై కదంతొక్కిన గంగిరెద్దా!

నీ కాళ్ళ కందకుండా కల్యాణి కొలువుదీర్చిన కలల బొమ్మలనేమి చేయగలవోయ్?

***

నిజం లోగిలిలో కల

చిలుక నోట్లోంచి జారిపడ్డ దోర జామపండు కాక మరేమిటీ?

***

నీ కల విలువెంతో

అది తీరిన వెనుక నీ కాంత కంటి చివర నిల్చిన ముత్యాన్ని అడగద్దటోయీ?


జనవరి 4, 2010

హిమకుసుమాలు-83(కొరమానినతనం కొరతెందుకౌతుంది?)

వెల్గుల రాజు  రోజూ వచ్చి నా వెన్ను నిమరలేదు.

ఆరారగా అమ్మ ధరణి తన గొంతు తడుపుకుంటూ నా ఆర్తి తీర్చలేదు.

ఏదో — గాలీ, ధూళీ దయతలిస్తే రంగులద్దుకున్నాను నేను.

ఓ రేకు అటో ఇటో అయితేనేం, నీ సిగ పాయల నిల్వ సరితూగను ఫో!

నీ పాదార్చనకైనా నన్ను ఎంచుకోరేం? అక్కడ సైతం నన్ను నిల్వనీయరేం?

ఎంతో పుణ్యాత్ములే వీరు ,

ఓ గ్రుడ్డి పూవుకు ఒకింత పుణ్యము పంచగలేరూ?

దైవ సన్నిధిని ఏదో ఓ మూల నాకూ ఓ చోటు చూపించగలేరూ?

వీరు చూపేదేమిటిలే!

నను గన్న రాజుకి నీరెండ మాటున నిల్చి ఒద్దికగా నమస్కరించి, నా కన్నతల్లి పాదాల చుంబింతు నేను.

అంతే కానీ, కొరమానినతనం కొరతెందుకౌతుంది?

డిసెంబరు 17, 2009

హిమకుసుమాలు-82(తిరునాళ్ళ త్రిప్పట)


ఏకాంతం లో
కొన్నిసార్లు అలవోకగా శరన్మేఘమై స్మృశిస్తూ
కొన్నిసార్లు వసంత కోకిలల్లే కవ్వించి పిలుస్తూ
కొన్నిసార్లు చిత్తడి వానల్లా తడిపేస్తూ
నీతో ముడిపడిన  ఙ్ఞాపకాలూ, నా యెదకి
తిరునాళ్ళలో తిరిగినంత అలసటని కలుగ జేస్తాయి!

అదంతా నీతో ఏకరువెట్టి భారం పంచుకుందామంటే,
బ్రతుకు ముద్ర బరువుగా పగలంతా మోసిన నీ కళ్ళు
ఒద్దికగా ఓరువాకిలిలా మూసుకుని మరునాటి పరుగుకేమో, సిద్దమౌతుంటాయి.

డిసెంబరు 14, 2009

హిమకుసుమాలు-81(బ్రతుకు వెంబడి బంధాలు)


కొన్ని -
తామరాకుపై నీటిబొట్లులా నిశ్శబ్దంగా కేవలం…
కొన్ని-
సాయం సాంధ్యన వినిపించీ వినిపించకుండా దూరాన సాగే పాటలా…
కొన్ని-
నిశ్శబ్దంలో ప్రక్కనే వుండి పలు మార్లు ఇబ్బంది పెట్టే బల్లి కూతలా…
కొన్ని-
ఎక్కడ వున్నా నీకై, నీకోసమే,నీలోనే మేము అంటూ ప్రాణ నాడిలా…
****
ఏ బంధమెపుడు ఏ రూపాంతరం చెందుతుందో చెందిందో విశ్లేషణ అసాధ్యం! అనవసరం!
అన్నిటిని ఆస్వాదించుట అనివార్యం!

డిసెంబరు 11, 2009

హిమకుసుమాలు-80(కొత్త పంథా)


పాలపుంతపై పరుగూ,
నల్లెరు మీద నడకా–అని ఎంచి
జీవనగమనంలో అలసిన క్షణాన
నిన్ను చేరుకోవాలనుకుంటే
‘నేను మరో అవతారమెత్తి
మీ మధ్యకే వస్తానంటూ’ నువ్వు బయలుదేరేవు!
నా చుట్టూ వున్న నలుగురిలోనూ
నీకై వెతుకులాట నా కొత్త పంథా!

నవంబరు 22, 2009

హిమకుసుమాలు-7 9 (సెల్ తో స్వర మేళనం!)

నీకై నేనాలపించే నిశ్శబ్ధ గీతంతో
గాలి గొంతుక కల్పి ఇప్పటికిప్పుడు నీ చెవి జేరి
నీ యెదను రేపిన అలజడి నా దరి జేరిందెలాగో చెప్పుకో!
అర్థమవడానికేముందక్కడ? నా సెల్ మరోమారు మ్రోగుతోందిగా!

నవంబరు 16, 2009

హిమకుసుమాలు(తర్జుమా తలపులు-9)

ALL YOU WHO SLEEP TONIGHT

ఈ రేయి నిద్రించు మీకెల్లరికి

IV QUATRAINS
చతుష్పాదములు

DARK ROAD
చీకటి బాట

by Vikram  Seth

ఈ రహదారిని చీకటి క్రమ్ముకుంది,మరియు నివాసం దూరంగా నిల్చింది.
నిద్రించవోయి ఇప్పుడు, నీవున్న గతిమాలిన స్థితిలోనే.
ఈ రేయి స్వప్నానికి తావు ఈయకు, ఇక రేపూ
భయవిహీనుడవై లేవవోయి, విచారం నుండి సగమైనా విముక్తుడివై.

DARK ROAD

by Vikram  Seth

The road is dark, and home is far.

Sleep now, in the poor state you are.

Tonight be dreamless, and tomorrow

wake free from fear, half-free of sorrow.

నవంబరు 7, 2009

హిమకుసుమాలు-77 (ఇబ్బడి ముబ్బడి ఇరుకు ఇక్కట్లు- 6)


‘1/4కిలో కొక రూపాయన్న లాభంలేకపోతే ఎలా తల్లీ!’ ?అన్న కూరల బండివాడు
‘1/2కిలో కొన్నాక ఒక రూపాయన్నా మిగుల్చుకోకపోతే ఎలాగయ్యా ?’అనే మధ్యతరగతి ఇల్లాలు
తేలని ఈ వాదనని తేల్చేందుకన్నట్లు ఎండు కొత్తిమీర కట్ట ఉచితముగా పారేసి పరుగెట్టెనతడు
ఇబ్బడి ముబ్బడి ఇరుకు ఇక్కట్ల సందుల
బ్రతుకు బాట ప్రక్కగ విరిసే పకపకలివిలే!

అక్టోబర్ 31, 2009

హిమ కుసుమాలు-76(నిర్వాణమంటే…?)

నిర్వాణమంటే…?
ఈ ఎద ఓ అగ్నిహోత్రం
ఏ దృశ్యాన్ని ఎప్పుడు ఆజ్యంగా స్వీకరిస్తుందో తెలియదు.
ఎవరి మాటలు మంత్రోచ్చటనమనుకుంటుందో తెలియదు.
ప్రజ్వరిల్లి పైకి లేచి “దాహం”, “దాహం” అన్నట్లనిపిస్తుంది.
ఏ కోర్కే ఎప్పుడు దగ్దమౌతుందో తెలియట్లేదు.
ఎప్పుడు ఏ కోర్కె నన్ను దహిస్తుందో తెలియట్లేదు.
ఇప్పుడు నేను జాగృత అవస్థలో ఉన్నానా?
లేదా ఏ చేతన శక్తికో నేను పరికరన్నా?
ఇది నాకు తెలియట్లేదు!

తెలుసుకోవడమే నిర్వాణమా?

అక్టోబర్ 24, 2009

హిమకుసుమాలు-75( హిమకుసుమాలు-75(ఇబ్బడి ముబ్బడి ఇరుకు ఇక్కట్లు-5)

ఈసుల రోసుల కంపుల కలబడి, పోరి పోరి వెలికొచ్చి
నీ మనసునకిరవైన  ఊసులు ఇరవై చెప్పగలుగుదు నేను
ఇబ్బడి ముబ్బడి ఇరుకు ఇక్కట్ల సందుల
బ్రతుకు బాట ప్రక్కగ విరిసే పకపకలివిలే!